పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం వుండేది. అందులో దాదాపు వెయ్యిమంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ వుండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు, కానీ రానురాను దేశంలో ఆరాజరికం ఏర్పడి ఆశ్రమం నిరాధారమైపోయింది. ఆశ్రమానికి వుండిన ఆవుల మందలు క్షీణించిపోయాయి. ఆశ్రమంలో వుండేవారు చిరికిన గుడ్డలు ధరించవలసి వచ్చింది. యోగుల గురువు ఏవిధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు, కానీ ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు.
ఈ ఆశ్రమంలో వుండే గోవులను చూసేటందుకు జంబూకుడనే వాడు వుండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. కొంతకాలం వాణ్ణి వాళ్ళ నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది. ఆ తరువాత వాడు బొత్తిగా అనాధ అయిపోయి గాలికి తిరుగుతుంటే యోగుల గురువు చూసి వాడిని ఆశ్రమానికి తీసుకొని వచ్చి పశువులను చూసే పని ఇచ్చాడు.
అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు వుంటూ పశువులను కాస్తూ, దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
ఆర్ధికంగా ఆశ్రమవాసులు పడుతున్న ఆగచాట్లు జంబూకుడు చూస్తూనే వున్నాడు. ఒకనాడు వాడి కొక ఉపాయం తోచింది. వాడు గురువు వద్దకు వెళ్ళి, “గురూజీ, మనకు డబ్బు ఇబ్బంది లేకుండా వుండలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది” అన్నాడు.
“ఏమిటి నాయనా, అదీ?” అని గురువు ఆశ్చర్యంగా అడిగాడు.
“మా నాయనమ్మ కాపుపెట్టి ఒక ద్రావకం తయారుచేసేది. దాన్ని అమృతసారం అనేవాళ్లు. ఎంతో మంది ధనికులు ఆవిడ చేత అమృతసారం కాయించుకునేవారు. చాలా కాలం నేను కూడా ఆవిడకు తవదుగా పనిచేశాను. ఇద్ధరం ఊరి బయటికి వెళ్ళి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్ళం. ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని నేను రోజు చూస్తూనే వున్నాను. ఇప్పుడు నాకు తట్టినదేమంటే మన ఆశ్రమంలో ఈ అమృతసారం తయారుచేసి లాభానికి అమ్మినట్టయితే మనకు ఒకరి సహాయం అవసరం వుండదు! సుఖంగా బతకవచ్చు” అన్నాడు జంబూకుడు.
“అమృతసారం ఎలా చేయాలో నీకింకా జ్ఞాపకం వుందా, నాయనా?” అని గురువు అడిగాడు. పూర్తిగా జ్ఞాపకం వుంది అన్నాడు జంబూకుడు. వెంటనే పెద్ధ యోగులందరూ చేరి, అమృతసారం ఆశ్రమంలో తయారు చేసి విక్రయించడానికి నిర్దారణ చేశారు.
పశువులు కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృతసారం కాయడానికి పూనుకున్నాడు. ఈ పనికి గాను ప్రత్యేకంగా ఒక కుటీరం ఆశ్రమానికి కొంచం దూరంగా నిర్మించారు. అందులో జంబూకుడు తప్ప మరెవరూ ప్రవేశించడానికి లేదు. అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు. త్వరలోనే కళాయిలో అమృతసారం తయారైంది. దానిని కొద్దిగా చవి చూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి “గురూజీ, అమృతసారం తయారు అయింది” అన్నాడు.
పెద్ద యోగులంతా కలిసి లెక్కలు కట్టారు. తయారు చేయడానికి అయ్యే ఖర్చుకు పదింతల ధరకు దాన్ని అమ్మటానికి నిర్ణయం జరిగింది. తయారైన అమృత సారాన్ని నాలుగు బుడ్డిలలో నింపి నలుగురు సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు. ఆ సంపన్నులు అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు.
అమృతసారం ఖ్యాతి త్వరలోనే వాడ వాదలా పాకింది. రోజుకు పదేసి బుడ్లు అమ్మిన అమృతసారం, వంద బుడ్లు అమ్మింది. వంద బుడ్లు చూస్తుండగానే అయిదు వందలయ్యాయి. చివరకు రోజుకు వెయ్యి బుడ్లు తయారుచేసినా చాలని స్థితి ఏర్పడింది. రాజాధిరాజుల దగ్గర నుండి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతివాళ్ళూ తమ ఇంట రెండు మూడు బుడ్లు అమృతసారం దాచివుంచసాగారు.
ప్రతి పండగకూ, ఉత్సవానికి, పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకూ అమృతసారం జాస్తిగా ఖర్చవుతూ వుండేది.
ఆశ్రమంలో కనక వర్షం కూరుస్తున్నది. అక్కడ వున్న చిన్న చిన్న కుటీరాలు పోయి, మేడలు, మిద్దెలు వచ్చాయి. ఆశ్రమానికి ఇప్పుడు రెండువేల ఆవులు ఏర్పడ్డాయి. అందరికీ ఒంటినిండా బట్టా, కడుపునిండా తిండీ వున్నది.
అమృతసారం తయారు చేయడానికి ఇప్పుడు పెద్ద భవంతి ఏర్పాటుచేశారు. మూలికలు తీసుకొని రావడానికి ముప్పై మంది మనుషులను జీతాలిచ్చి పెట్టుకున్నారు. కానీ బట్టీ వద్ద వుండే పని జంబూకుడికి తప్పలేదు. కాపు ఎంత వుండాలో అది అతనికి ఒక్కడికే తెలుసు. అతను రోజల్లా బట్టివద్దనే వున్నప్పటికీ పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించేవారు.
ఒకనాటి రాత్రి ప్రార్ధనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి, “ఏయ్, ఏం చేస్తున్నారు మీరంతా?” అని గట్టిగా అరవసాగాడు. అది విన్న గురువు “మన జంబూకుడికి ఏదో గాలి సోకి నట్టుంది! అవతలకి తీసుకొని వెళ్ళండి!” అన్నాడు.
మర్నాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి ఆయన పాదలపై పడి, “గురూజీ, నన్ను మన్నించండి! ఈ అమృతసారం చాలా పాపిష్టిది. దాని ప్రభావంచేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను. మీ అందరి సాంగత్యం చేస్తూ, మీ సహాయంతో ఆత్మ దర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిష్టి పానీయం తయారు చేస్తూ రోజల్లా నరకమార్గాన పోతున్నాను. దయచేసి నా ఆవులు నాకు ఇప్పించండి!” అన్నాడు.
గురువు పెద్ద యోగులందరినీ పిలిపించి, జంబూకుడు అంటున్న మాటలను వారికి చెప్పాడు. “అయ్యో, జంబుకా! ఈ అమృతసారం చేయడం నీవల్ల తప్ప మరొకరి వల్ల కాదు. అవులను ఎవరయినా కాయవచ్చు! అమృతసారం చేయటం మానేశామంటే మనం పడే తిప్పలు అంతా ఇంతా కాదు. మనం లోగడ అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచం గుర్తుకు తెచ్చుకో!” అన్నారు పెద్ద యోగులు.
గురువు జంబూకుడికేసి తిరిగి, “నాయనా, ఈ అమృతసారాన్ని నీవు తయారు చేస్తే మాత్రం దాన్ని తాగవలసిన అవసరమేమున్నదీ?” అని అడిగాడు.
“గురూజీ, దినుసులు సారి అయిన పాళ్లలో పడినదీ లేనిదీ చూసి తెలుసుకోగలను కానీ, కాపు సరిపోయినదీ, లేనిదీ జిహ్వకు మాత్రమే తెలుస్తుంది. అందుచేత బట్టీదించినప్పుడల్లా అమృతసారాన్ని రుచి చూడక నాకు తప్పదు!” అన్నాడు జంబూకుడు.
“అలా అయితే అందుకు పది చుక్కలో, ఇరవై చుక్కలో ఎంచి రుచి చూడు. అంతా మాత్రం చేత అది కీడు చేయలేదనుకుంటాను!” అన్నాడు గురువు.
జంబూకుడు సరే అన్నట్టు తల ఊపాడు. యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పి పోయినట్టుగా నిట్టూర్పులు వదిలారు.
మరి కొంత కాలం గడిచింది. మళ్ళీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు పల్లె పాటలు గట్టిగా పాడుతూ, మధ్యమధ్యలో వెకిలిగా నవ్వుతూ వచ్చాడు. అతను తప్ప తాగి ఉన్నాడు. కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు. అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు. వారు ఆయనతో , “నూరు ఆరైనా, ఆరు నూరైన అమృతసారం తయారు కావాల్సిందే!” అన్నారు.
మర్నాడు ఉదయం జంబూకుడు మళ్ళీ వచ్చి గురువుగారి పాదలపై పడి, “గురూజీ, నన్ను ఈ మహనరకం నుండి మీరే రక్షించాలి. ఇక నేనా బట్టీ దగ్గరికి చచ్చినా పోను! దీని కోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను!” అన్నాడు.
“ఇప్పుడేం వచ్చింది, నాయనా? అమృతసారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమను చెప్పాను కదా! అలాగే చేస్తున్నావా?” అని గురువు అడిగాడు.
“ఇరవై చుక్కలు రుచి చూశాక అది నన్ను వాడులుతుందా, గురూజీ? దాని వాసనే చాలునే పతనం కావడానికి! దాన్ని కళ్ళతో చూడడం కూడా పాపమే, నన్నడిగితే! అందుచేత నాకు ఆవులు కాసేపనిగాని, లేక మరొక పని ఏదైనా సరే ఇప్పించండి!” అన్నాడు జంబూకుడు.
“పిచ్చివాడా, భయపడకు! మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మాకోసం నీవు ఏ పాతకం చేసినా అది నిన్ను అంటదు. నిన్ను కుంభీపాక నరకం నుండి కూడా ఉత్తమ లోకాలకు లాగే యోగశక్తి నావద్ద ఉన్నది. కనుక నిశ్చింతగా కుటీరానికి వెళ్ళి నీ అమృతసారం సంగతి చూసుకో!” అన్నాడు గురువు.
అదిమొదలు జంబూకుడు పాప భయం ఎరగకుండా, భారమంతా గురువుపైన వేసి అమృతసారం తయారు చేయసాగాడు. అతను చీకటి పడేసరికి తప్ప తాగి ఉండేవాడు, కానీ ప్రార్థనలు చేసే చోటికి మాత్రం వెళ్ళేవాడు కాదు. తాగిన మైకంలో ఎక్కడ ఒళ్లు తెలియకపోతే అక్కడే పడిపోయేవాడు. మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేర్చుతూ ఉండేవారు.
కాలక్రమేన యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్లారు. యోగుల గురువు నరకానికి వెళ్ళే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ కల్పవృక్షం కింద కూచొని ఉన్న కాంబోవకుడు కనిపించాడు.
భేతాలుడు ఈ కథ చెప్పి, “రాజా, ఏ పాపమూ చెయ్యని యోగులందరూ నరకానికి పోతే రోజూ తప్ప తాగిన జంబూకుడు మాత్రం స్వర్గానికి వెళ్ళడానికి గల కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “జంబూకుడు తప్ప తాగినా ఆశ్రమ నియమాలకూ, గురువు గారి ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు. అతని మనసు మాత్రం అనుక్షణం ఉత్తమ లోకాల మీదనే వున్నది. మిగిలిన యోగులు అలా కాదు, వారి మనస్సు ఎంతసేపూ పాపిష్టి డబ్బుపైనే ఉన్నది. వారు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అందుచేతనే వారు నరకానికి వెళ్లారు. జంబూకుడు దౌర్భాల్యం కొద్దీ తాగాడే గాని తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసు. అందుకే అతను స్వర్గానికి వెళ్ళాడు!” అన్నాడు.
రాజుకు ఈవిధంగా మౌనభంగం కాగానే భేతాళుడు శవంతో సహ మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.